Rahul Dravid: రూ.2.5 కోట్లు చాలు .. మిగతా రూ.2.5 కోట్లు వెనక్కి తీసుకోండి: బీసీసీఐకి ద్రావిడ్ విజ్ఞప్తి

Rahul Dravid asked the BCCI to reduce his cash reward says reports
  • ఇతర కోచింగ్ సిబ్బందితో సమానంగా రూ.2.5 కోట్లు చాలన్న మాజీ కోచ్
  • ద్రావిడ్ విజ్ఞప్తిని గౌరవిస్తామన్న బీసీసీఐ వర్గాలు
  • 2018లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా రూ.30 లక్షలు వెనక్కి ఇచ్చేసిన క్రికెట్ దిగ్గజం
టీమిండియా మాజీ ప్రధాని కోచ్, టీ20 వరల్డ్ కప్ 2024ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మాజీ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఎంత హూందాగా నడుచుకుంటారో తెలియజేసే పరిణామం ఒకటి వెలుగుచూసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌‌ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల భారీ రికార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ మొత్తం నుంచి ఆటగాళ్లతో సమానంగా ప్రధాన కోచ్ ద్రావిడ్‌కు కూడా బీసీసీఐ రూ.5 కోట్లు అందించింది. అయితే ప్రత్యేకంగా తనకు రూ.5 కోట్లు వద్దని, ఇతర కోచింగ్ సిబ్బంది మాదిరిగానే రూ.2.5 కోట్లు ఇస్తే చాలు అని, మిగతా రూ.2.5 కోట్లు వెనక్కి తీసుకోవాలంటూ బీసీసీఐకి రాహుల్ ద్రావిడ్ విజ్ఞప్తి చేశాడు.

మిగిలిన సహాయక సిబ్బంది బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాదిరిగానే తనకు కూడా రూ. 2.5 కోట్లు ఇవ్వాలని, బోనస్ అవసరం లేదని కోరినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ద్రావిడ్ సెంటిమెంట్‌ను గౌరవిస్తామంటూ బీసీసీఐ పేర్కొన్నట్టు ఓ జాతీయ మీడియా సంస్థలో కథనం వెలువడింది.

కాగా టీ20 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోచింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి కూడా బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, ఇతర కోచ్‌లకు రూ. 2.5 కోట్లు చొప్పున కేటాయించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పోల్చితే ద్రావిడ్ రూ.2.5 కోట్లు ఎక్కువ పొందినట్టు అయింది. 

అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఇంతే..
2018లో అండర్-19 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకున్నప్పుడు జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఆ సమయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించాడు. రివార్డుగా రూ.50 లక్షలు పొందాల్సి ఉండగా ఇతర సహాయక సిబ్బంది మాదిరిగా తనకు కూడా రూ.20 లక్షలు చాలు అని చెప్పాడు. రూ.30 లక్షలు తిరస్కరించాడు. రివార్డు అందరికీ సమానంగా ఉండాలని ఆ సందర్భంగా పేర్కొన్నాడు. దీంతో కోచింగ్, ఇతర సహాయక సిబ్బంది అందరికీ రూ.25 లక్షలు చొప్పున బీసీసీఐ రికార్డు అందించింది.
Rahul Dravid
BCCI
T20 World Cup 2024
Cricket

More Telugu News