Rishikesh: రిషికేష్ లోని పవిత్ర గంగా ఘాట్ లో బికినీల్లో విదేశీయులు
- ఆడ, మగ స్నేహితుల బృందం కలిసి జలకాలాట
- నెట్టింట వీడియో వైరల్.. ఇవేం పనులంటూ మండిపడుతున్న నెటిజన్లు
- దేవభూమిని మరో గోవాగా, మినీ బ్యాంకాక్ గా మారుస్తున్నారంటూ ఆగ్రహం
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషీకేష్ లో విదేశీ పర్యాటకులు పవిత్ర గంగానదిలో బికినీలు ధరించి స్నానాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొందరు యువతులు బికినీల్లో, మరికొందరు యువకులు షార్ట్స్ ధరించి నదిలోకి పరుగుపరుగున దూకి జలకాలాటలు ఆడటం కనిపించింది.
హిమాలయన్ హిందూ పేరిట ఓ యూజర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ వీడియోను పంచుకోగా దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆధ్యాత్మికతకు మారుపేరైన దేవభూమిలో ఇవేం పనులంటూ విమర్శిస్తున్నారు.
‘పవిత్ర గంగానదిని గోవా బీచ్ గా మార్చినందుకు పుష్కర్ ధామీ మీకు ధన్యవాదాలు. రిషికేష్ లో ప్రస్తుతం ఇలాంటివి జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతం మినీ బ్యాంకాక్ గా మారిపోతుంది’ అంటూ ఓ యూజర్ విమర్శించాడు. ఇలాంటి వాటికి అనుమతిస్తున్నందుకు పరోక్షంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ తీరును తప్పుబట్టాడు.
మరొకరు స్పందిస్తూ ‘రిషీకేష్ ఇక ఆధ్యాత్మిక, మత, యోగాకు చిరునామాగా ఉన్న నగరం ఎంతమాత్రం కాదు. ఇది ఇప్పుడు గోవాలాగా మారిపోయింది. రిషీకేష్ లో ఇలాంటి రేవ్ పార్టీలు, జోంబీ సంస్కృతిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పుష్కర్ ధామీగారు.. దేవభూమి ఇందుకే ఖ్యాతిగాంచిందా? ఈ పవిత్ర నగరాన్ని వారు నాశనం చేసేలోగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది’ అని కామెంట్ చేశారు. రిషీకేష్ సాంస్కృతిక గుర్తింపును పశ్చిమ దేశాల పార్టీ సంస్కృతి చెరిపేస్తోందని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మిక విలువలకు పాతరేసేలా అధికార యంత్రాంగం రిషీకేష్ ను ఓ పర్యాటక నమూనాగా మారుస్తోందని విమర్శకులు సైతం మండిపడుతున్నారు. ప్రపంచ పోకడల నడుమ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లను ఈ అంశం తెరపైకి తెస్తోందంటున్నారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మరికొందరు నెటిజన్లు మాత్రం విదేశీయులను వెనకేసుకొస్తున్నారు. నదులను ప్లాస్లిక్ కవర్లు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం చేయడంకన్నా ఇలా స్నానం చేయడం ప్రమాదకరమేమీ కాదని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. ‘అవును నిజమే.. ఇది భారత సంస్కృతి కాదు. నదీ స్నానాలు చేసే భారతీయులకు ఉండే బాన పొట్టలు వారికి కనిపించట్లేదేం? మనలాగా అండర్ వేర్లు ధరించి వాళ్లు స్నానాలు చేయడం లేదెందుకు?’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘వాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ల వస్ర్తధారణపై నీకు అభ్యంతరం ఉందంటే అది నీ పెంపకం లోపమే’ అని ఇంకొకరు పోస్ట్ చేశారు.