Donald Trump: వంకర బుద్ధి జో బైడెన్ ను ఓ అంశంలో మెచ్చుకోవాలి: ట్రంప్
- నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- విమర్శల్లో తీవ్రత పెంచిన ట్రంప్
- బైడెన్ కు కమలా హ్యారిస్ బీమా పాలసీ వంటిదని ఎద్దేవా
ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల దాడిలో తీవ్రత పెంచుతున్నారు. తాజాగా, దేశాధ్యక్షుడు జో బైడెన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వంకర బుద్ధి జో బైడెన్ ను ఓ అంశంలో మెచ్చుకోవాలి... బైడెన్ తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవడమేనని ఎద్దేవా చేశారు.
"బైడెన్ కు కమలా హ్యారిస్ ఓ ఇన్యూరెన్స్ పాలసీ వంటిది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా సగం సమర్థుడ్ని ఎన్నుకున్నా ఈపాటికి బైడెన్ ను సాగనంపేవారు... కానీ కమల్ హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉండడంతో బైడెన్ బతికిపోయాడు" అంటూ ఇద్దరినీ కలిపి విమర్శించారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా జూన్ 27న జరిగిన డిబేట్ లో బైడెన్ పేలవ ప్రదర్శన సొంత పార్టీ (డెమొక్రటిక్ పార్టీ)లోనే విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ రేసులో ఉండడం తెలిసిందే.