Balka Suman: రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక సమతూకం లేదు... బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు: బాల్క సుమన్
- 35 కార్పోరేషన్లలో సామాజిక న్యాయం లేకుండా పోయిందని విమర్శ
- కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పారన్న బీఆర్ఎస్ నేత
- నిరుద్యోగులు, విద్యార్థులను బెదిరింపులకు గురి చేసేలా వ్యవహరించారని ఆగ్రహం
- కేబినెట్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందని వ్యాఖ్య
రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడా సామాజిక సమతూకం కనిపించడం లేదని... పైగా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఇటీవల నియమించిన 35 కార్పోరేషన్లలో సామాజిక న్యాయం లేకుండా పోయిందని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... సుపరిపాలన అందిస్తామని... కక్ష సాధింపు చర్యలు ఉండవని సీఎం చెప్పారని... కానీ ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులను బెదిరింపులకు గురి చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు.
ఇదే రేవంత్ రెడ్డి అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు ఇదే నిరుద్యోగుల పక్షాన డీఎస్సీ, గ్రూప్-1, టెట్ నిర్వహణ గురించి వీళ్ళు మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి నడ్డిమీద తన్నుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి రాజ్యంలో అడుగడుగునా అవమానాలు, అవహేళనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల పట్ల వివక్ష కనిపిస్తోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం... అందరికీ అవకాశాలు అంటూ రేవంత్ ముచ్చట్లు చెబుతున్నారని... కానీ రవ్వంత కూడా అలా కనిపించడం లేదన్నారు.
కేబినెట్లోని ఎస్సీ, బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిలో ఉద్దేశపూర్వకంగా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్నపీట వేసి కూర్చోబెట్టారన్నారు. కానీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపీటలపై కూర్చున్నారని తెలిపారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా సేమ్ సీన్ రీపిట్ అయిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా అవమానం జరిగిందన్నారు. ఆయనను అధికారులు రిసీవ్ చేసుకోలేదన్నారు.