Raj Tharun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర
- లావణ్య రెండోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు
- అన్ని ఆధారాలు చూశాకే పోలీసులు కేసు నమోదు చేశారన్న అడ్వొకేట్
- రాజ్ తరుణ్ మాట్లాడిన ఆడియో క్లిప్స్‌ను మీడియాకు విడుదల చేస్తామని వెల్లడి
- బీరు బాటిల్స్‌తో లావణ్యపై దాడి చేయడమో లేక ఆమె కొట్టుకునేలా చేయడమో జరిగిందని వెల్లడి
- నిస్సహాయస్థితిలో అమ్మాయిని వేధిస్తుంటే ఎదురు తిరగకుండా ఏంచేస్తుందన్న కల్యాణ్ దిలీప్
నటుడు రాజ్ తరుణ్ - లావణ్య ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. రాజ్ తరుణ్‌పై మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాల్వితో రాజ్ తరుణ్ ఉంటూ తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ కుమార్ సోదరుడిపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. సోదరుడు తనను పలుమార్లు బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు, మాల్వీ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. లావణ్యపై గతంలో సైబరాబాద్ షీ-టీమ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
రాజ్ తరుణ్ పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. తనకు కొన్నాళ్ల క్రితం అబార్షన్ చేయించినట్లు చెప్పారు. తాను అన్విక పేరుతో రాజ్ తరుణ్‌తో కలిసి ఉన్నట్లు చెప్పారు. అన్విక పేరుతో ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్ళామన్నారు. మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపించారు. మాల్వీ కోసం అతను ముంబై వెళ్ళాడని, దీనిని తాను ప్రశ్నించానని.. నాటి నుంచి తనను దూరం పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య ఫిర్యాదును ఆధారాలతో స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
షాకింగ్ విషయాలు వెల్లడించిన కల్యాణ్ దిలీప్ సుంకర
రాజ్ తరుణ్‌పై 420, 493, 506 కింద కేసు నమోదైనట్లు అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. పోలీసులు వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేశాక... అన్ని ఆధారాలు చూశాకే కేసు నమోదు చేశారన్నారు. వాట్సాప్ చాటింగ్‌లో లావణ్యను రాజ్ తరుణ్ బూతులు తిట్టాడన్నారు. లావణ్యకు అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నంలో తన చేతిని తానే కాల్చుకున్నాడన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడిన వాటికి ఆధారాలు లేవన్నారు. అతను మాట్లాడిన ఆడియో క్లిప్స్‌ను కూడా మీడియాకు విడుదల చేస్తామన్నారు.
రాజ్ తరుణ్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రేపో మాపో పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తారని తెలిపారు. లావణ్య బూతులు మాట్లాడుతోందని చాలా చానల్స్‌లో వైరల్ చేశారని.. కానీ బీరు బాటిల్స్‌తో లావణ్యను రాజ్ తరుణ్ కొట్టడమో... లేక కొట్టుకునేలా చేశాడో తెలియదు... ఆ సమయంలో తిట్టిందన్నారు. అమ్మాయిని చిత్రవధ చేస్తుంటే... నిస్సహాయస్థితిలో తిరగబడకుండా ఏం చేస్తుందన్నారు. రేపు ఉదయం మీడియా ముందుకు పూర్తి వివరాలతో వస్తామన్నారు. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.