Prabhakar Rao: నేను ఏ తప్పూ చేయలేదు.. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు
- అనారోగ్య కారణాల వల్ల ఇండియాకు రాలేక పోయానని లేఖ
- క్యాన్సర్ తో పాటు బీపీతో కూడా బాధ పడుతున్నానని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు, తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. జూన్ 23న ఆయన లేఖ రాసినప్పటికీ... ఈ అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 26న తాను అమెరికా నుంచి ఇండియాకు రావాల్సి ఉందని... అయితే అనారోగ్య కారణాల వల్ల యూఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఒక పోలీసు అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని... తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరుతున్నానని.... విచారణలో పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోనని... పూర్తిగా కోలుకున్న తర్వాత దర్యాప్తు అధికారుల ముందు హాజరై, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన చెందుతున్నామని చెప్పారు.