George Clooney: బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు.. అధ్యక్షుడి సన్నిహితుడి వ్యాఖ్య

George Clooney says Democrats need a new nominee In Presidential Elections
  • సొంతపార్టీ నుంచే బైడెన్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత
  • గెలుపు కష్టమే అంటున్న బైడెన్ సన్నిహితుడు జార్జ్ క్లూనీ
  • అభ్యర్థిని మార్చకుంటే రెండు సభలలో పట్టుకోల్పోతామని డెమోక్రాట్లకు వార్నింగ్
ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి గెలవడం కష్టమేనని డెమోక్రాటిక్ మద్దతుదారుడు, హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ స్పష్టం చేశారు. బైడెన్ లో గతంలో ఉన్న ఉత్సాహం లేదని, ఇటీవల నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆయనను చూశాక గెలుపుపై తనకు ఆశలు సన్నగిల్లాయని చెప్పారు. పార్టీకి పెద్దఎత్తున నిధులు సమకూర్చే వారిలో క్లూనీ కూడా ఉన్నారు. అంతేకాదు, జో బైడెన్ కు క్లూనీ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వ్యాఖ్యలు తాజాగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ బరిలోకి దిగితే ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు విజయం నల్లేరు మీద నడకలా మారుతుందని హెచ్చరించారు. ప్రతినిధుల సభతో పాటు సెనేట్ లోనూ డెమోక్రాటిక్ పార్టీ పట్టుకోల్పోతుందని చెప్పారు.

బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ ఆశలు లేవని క్లూనీ చెప్పారు. చట్ట సభ్యులు, గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని క్లూనీ తెలిపారు. వారందరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, బైడెన్ తప్పుకుంటేనే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చారు. సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, ఓ స్నేహితుడిగా బైడెన్‌ను తాను ఎంతో ప్రేమిస్తానని క్లూనీ చెప్పారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో అనేక ఆటుపోట్లను బైడెన్ సమర్థంగా ఎదుర్కొన్నారని అన్నారు. అయితే, ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్‌ రెండోసారి గెలుస్తారని క్లూనీ ఆందోళన వ్యక్తంచేశారు.

డిబేట్ తర్వాత ట్రంప్ కు పెరిగిన మద్ధతు..
ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఇటీవల జరిగిన తొలి డిబేట్ తర్వాత ట్రంప్ కు ఆదరణ పెరిగిందని ‘సిక్కు అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌’ గ్రూప్‌ చీఫ్ జస్దీప్‌ సింగ్‌ జస్సీ తెలిపారు. సిక్కులతో పాటు భారతీయులు, ఆసియావాసులలో మెజారిటీ ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారని, రిపబ్లికన్ పార్టీ కోసం భారీగా విరాళాలు సేకరిస్తున్నారని జస్దీప్ చెప్పారు. ఎన్నికలు సక్రమంగా జరిగితే డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఖాయమని చెప్పారు.
George Clooney
Joe Biden
Democrates
America
US Presidential Polls
Donald Trump

More Telugu News