Ambati Rambabu: చంద్రబాబు కావాలని... జగన్ వద్దని ఓటేసిన ప్రతి తల్లిని అడుగుతున్నాను: అంబటి రాంబాబు
- తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు మాట తప్పారన్న అంబటి
- దారుణమైన మోసాలు చేస్తున్న చంద్రబాబుకు ఈ తల్లులు ఓటు వేశారని వ్యాఖ్య
- జగన్ అధికారంలో ఉండి ఉంటే జూన్ చివరి నాటికి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేవన్న అంబటి
- వైసీపీ ప్రశ్నలకు కూటమి నేతలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్
'తల్లికి వందనం' కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. 'చంద్రబాబు కావాలని... జగన్ వద్దని... ఓట్లు వేసిన తల్లులను అడుగుతున్నాను... ఓట్లు వేసిన కుటుంబాలను అడుగుతున్నాను... ఇంత దారుణమైన మోసాలు చేస్తున్న చంద్రబాబుకు మీరు ఓటు వేశారు గుర్తుంచుకోండి' అన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇదే జగన్ అధికారంలో ఉండి ఉంటే జూన్ చివరి నాటికి ప్రతి తల్లి ఖాతాలో డబ్బులు వేసి ఉండేవాడన్నారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా చరిత్రహీనుడుగా చంద్రబాబు మరోసారి మిగిలిపోనున్నారన్నారు. తల్లికి వందనంపై జీవో జారీ చేశారు కానీ... ఎప్పుడు వేస్తారో కూడా తెలియదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్ దేశంలోనే పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి జగన్ ఎంతో కృషి చేశారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా జగన్ రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని... కానీ తాము ఒక్కో పిల్లవాడికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చెప్పారని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంతమందిని పంపించినా రూ.15 వేలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఇది సూపర్ సిక్స్ కాదని... సూపర్ మోసమని ఎద్దేవా చేశారు. ఇది తల్లికి వందనం కాదని... తల్లికి మోసమన్నారు.
తల్లికి వందనం విషయంలో కూటమి నేతలు ఆలోచించాలని సూచించారు. అయినా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు? అని విమర్శించారు. కానీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన ఘనత జగన్‌దే అన్నారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా చేయలేదన్నారు. ఈ ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవు దాటాక తెప్ప తగలేసే రకం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మోసంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి... మాట మార్చడంపై వైసీపీ ప్రశ్నలకు కూటమి నేతలు, పవన్ కల్యాణ్, చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో ఉండి ఉంటే రైతు భరోసా ఇప్పటికే వేసి ఉండేవాడన్నారు. పెన్షన్లు కూడా ఇచ్చి ఉండేవారన్నారు. సంక్షేమ పథకాలు కచ్చితంగా ఇచ్చేవారన్నారు. కానీ చంద్రబాబు వాటిని నెరవేర్చడం లేదన్నారు. వైసీపీ ప్రజల పక్షాన కొట్లాడుతోందన్నారు. తాము 40 శాతం ఓటు బ్యాంకు సాధించామన్నారు.