PCB Files: కరకట్టపై ఫైళ్ల దహనం కేసు వేగవంతం.. కీలక పత్రాల స్వాధీనం
- నిందితుడు రామారావు ఫ్లాట్‌తోపాటు, పీసీబీ కార్యాలయంలో ఏకకాలంలో విచారణ
- రిటైరయ్యాక కూడా ఫైళ్లు ఇంట్లో ఎందుకున్నాయని ప్రశ్న
- ఎవరి ఆదేశాలతో ఫైళ్లను ఇంట్లో ఉంచుకున్నారని ఆరా
- పీసీబీ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
విజయవాడ కరకట్టపై ఫైళ్ల దహనం కేసును వేగవంతం చేసిన పోలీసులు నిన్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్‌గా పనిచేసిన సమీర్‌శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న పోలీసులు నిన్న ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఆయన ఫ్లాట్‌తోపాటు పీసీబీ ప్రధాన కార్యాలయంలోనూ ఏకకాలంలో రెండు బృందాలు విచారణ చేపట్టాయి.
ఈ సందర్భంగా ఆయన ఇంటి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఫైళ్లను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి ఆదేశాలతో పెట్టుకున్నారు? ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు? వంటి ప్రశ్నలకు ఆయన నుంచి అధికారులు సమాధానాలు రాబడుతున్నట్టు తెలిసింది. గత నెల 27న సాయంత్రం పీసీబీ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్లనట్టు అనుమానిస్తున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.