Kolkata Knight Riders: గంభీర్ స్థానంలో దిగ్గజ ఆటగాడిపై కన్నేసిన కోల్‌కతా నైట్ రైడర్స్!
- మెంటార్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్‌ను నియమించుకునే యోచనలో ఉన్నట్టు కథనాలు
- గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన కలిస్
- 2019లో కోచ్‌గానూ వ్యవహరించిన దిగ్గజ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024తో భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో అతడి స్థానంలో గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా గంభీర్ ప్రయాణం శ్రీలంక టూర్‌తో మొదలుకానుంది. ఈ సిరీస్‌లో భారత్ జట్టు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాగా భారత కోచ్‌గా గంభీర్‌కు అవకాశం దక్కడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన మెంటార్‌ను కోల్పోయింది.
ఇక గంభీర్ నేతృత్వంలో కోల్‌కతా జట్టుకు పనిచేసిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో చేరవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. పర్యవసానంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త కోచింగ్ సిబ్బందిని అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది.
గంభీర్ స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ను మెంటార్‌గా నియమించుకోవాలని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యోచిస్తున్నట్టు తొలుత కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఐపీఎల్-2025 సీజన్ కోసం గంభీర్ స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్‌ను నియమించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.
జాక్వెస్ కలిస్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ‘ది టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది. 2019లో జట్టుకి ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన ఈ దిగ్గజ క్రికెటర్ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొంది.
జాక్వెస్ కలిస్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు. 2012, 2014లలో గంభీర్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రెండు సార్లు అతడు జట్టులో ఉన్నాడు. ఇక 2015 సీజన్లో కోల్‌కతా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా అవకాశం దక్కడంతో జట్టుని వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వెళ్లాడు. కాగా గంభీర్ ఆధ్వర్యంలో కోల్‌కతా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది.