Danam Nagender: బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూస్తారు.. త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం: దానం నాగేందర్

BRSLP will merge in Congress soon says Danam Nagender
  • కేసీఆర్ ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదన్న దానం
  • బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారని విమర్శ
  • బీఆర్ఎస్ లో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం
బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ను కలవడానికి ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని... ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని విమర్శించారు. విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారని దుయ్యబట్టారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని... 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని అన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని దానం ఆరోపించారు. కేటీఆర్ బినామీలు కూడా వేల కోట్లు దోచేశారని చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయట పెడతానని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారని చెప్పారు. కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లో చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.
Danam Nagender
Congress
KCR
KTR
BRS

More Telugu News