Rahul Gandhi: స్మృతి ఇరానీని ఎవరూ దూషించవద్దు: రాహుల్ గాంధీ
- సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన స్మృతి ఇరానీ
- గెలుపోటములు జీవితంలో భాగమన్న రాహుల్ గాంధీ
- ఇతరులను దూషించడం బలం కాదు... బలహీనత అని వ్యాఖ్యలు
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ లాల్ శర్మ చేతిలో ఆమె పరాజయం చవిచూశారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు ఆసక్తికర ట్వీట్ చేశారు.
గెలుపోటములు జీవితంలో భాగమని పేర్కొన్నారు. స్మృతి ఇరానీ పట్ల అసహ్యకరమైన భాష ఉపయోగించడం మానుకోవాలని హితవు పలికారు. 'స్మృతి ఇరానీ కానీ, మరే నేతపై అయినా సరే, అవమానకరమైన పదజాలంతో విమర్శలు చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇతరులను అవమానించడం, బాధపెట్టడం అనేది బలం కాదు... బలహీనతకు సంకేతం అని పేర్కొన్నారు.
స్మృతి ఇరానీ ఎట్టకేలకు ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.