Bandi Sanjay: కాంగ్రెస్ మోసం చేసినందునే తెలంగాణ ప్రజలు బీజేపీని 8 సీట్లలో గెలిపించారు: బండి సంజయ్

Bandi Sanjay says bjp wins 8 seats due to six guarantees
  • తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరని బంధం ఉందన్న బండి సంజయ్
  • రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని విషప్రచారం చేశారని ఆగ్రహం
  • కార్యకర్తల కష్టంతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్న కేంద్రమంత్రి
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తించిన తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 లోక్ సభ స్థానాలు కట్టబెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరాని బంధం ఉందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లలో గెలిపించారని, ఈసారి 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని నిరూపించారన్నారు.

మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. కార్యకర్తల కష్టంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తలు తమ భుజంపై కాషాయ జెండాను మోశారని.. వారందరికీ సెల్యూట్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందన్న రాహుల్ గాంధీపై మండిపడ్డారు.

మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా? ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? అని సవాల్ చేశారు. ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిదన్నారు. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని... అయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ అనడం సిగ్గుచేటు అన్నారు.
Bandi Sanjay
Congress
BJP
Telangana

More Telugu News