IAS Krishna Teja: డిప్యుటేషన్ పై ఏపీకి రానున్న తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ... కేంద్రం అనుమతి
- ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజ
- విధి నిర్వహణలో సమర్థుడైన అధికారిగా గుర్తింపు
- కేరళ నుంచి ఏపీకి మూడేళ్ల డిప్యుటేషన్ కు కేంద్రం అనుమతి
కేరళ క్యాడర్ కు చెందిన తెలుగు యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ డిప్యుటేషన్ పై ఏపీకి రానున్నారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన కేరళ నుంచి ఏపీకి మూడేళ్ల పాటు డిప్యుటేషన్ కు కేంద్రం తాజాగా అనుమతి మంజూరు చేసింది.
కృష్ణతేజ కేరళలో సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. విధి నిర్వహణలో ఆయన కృషికి గుర్తింపుగా 2 అంతర్జాతీయ పురస్కారాలు, 7 జాతీయ అవార్డులు వరించాయి. కాగా, డిప్యుటేషన్ పై ఏపీకి వస్తున్న కృష్ణతేజ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తారని తెలుస్తోంది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొలువుదీరినప్పుడే... పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కృష్ణతేజ వస్తారంటూ ప్రచారం జరిగింది. కొన్ని వారాల కిందట కృష్ణతేజ అమరావతి వచ్చి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను కలిశారు. ఆ క్రమంలో, కృష్ణతేజ డిప్యుటేషన్ పై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది.