Pulasa Chepa: పులసల సందడి షురూ.. రూ. 24 వేలు పలికిన కేజీన్నర చేప!
- గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి
- ఎర్రనీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు
- కోనసీమ జాలరికి చిక్కిన పులస
- రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
వానాకాలం వచ్చిందంటే చాలు, గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఇక పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది.
తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేపా.. మజాకా!