Assembly By Polls: 13 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు... పంజాబ్‌లో ఆప్.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం

Assembly Bypolls Election Result 2024 Congress leads in Himachals Hamipur
  • ఇటీవల 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యం
  • బీహార్‌లో ఆధిక్యంలో జేడీయూ అభ్యర్థి
  • హిమాచల్ ప్రదేశ్‌లోని చెరో స్థానంలో కాంగ్రెస్, బీజేపీ ఆధిక్యం
బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే, ఇండియా కూటమి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ రోజున ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  

ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పుష్పీందర్ వర్మకు తొలి రౌండ్ ముగిసే సరికి 3,004 ఓట్ల మెజారిటీ లభించింది. సమీప బీజేపీ ప్రత్యర్థి ఆశిష్ శర్మకు ఇప్పటి వరకు 2,804 ఓట్లు పోలయ్యాయి. అలాగే, డెహ్రా స్థానం నుంచి పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్ మూడో రౌండ్ ముగిసే సరికి 7,287 ఓట్లతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకూర్ (ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య)పై స్వల్ప ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.  

 బీహార్‌లో అధికార జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్ మండల్ ఆధిక్యంలో ఉన్నారు. రూపౌలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు తొలి రౌండ్‌లో 6,588 ఓట్లు రాగా, ప్రతిపక్ష ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతికి 2,359 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్‌ 4,155 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దా, రాణాఘాట్, మణిక్తల, రాయ్‌గంజ్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటిలోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. 

పంజాబ్‌లో ఆప్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జలంధర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మొహిందర్ భగత్ 9,497 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్‌ 3,161, బీజేపీ అభ్యర్థి శీతల్ అంగ్రుల్ 3,161 ఓట్లతో వెనకబడి ఉన్నారు.
Assembly By Polls
Himachal Pradesh
West Bengal
Bihar
Punjab

More Telugu News