Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేసిన మెటా
- 2021లో క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి
- ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు నిలిపివేసిన మెటా
- తాజాగా నిషేధం ఎత్తివేస్తూ మెటా నుంచి ప్రకటన విడుదల
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలపై గతంలో విధించిన ఆంక్షలను మెటా తాజాగా ఎత్తివేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ఇవాళ ఓ ప్రకటన చేసింది. రాజకీయ నేతల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం తమ బాధ్యత అని మెటా స్పష్టం చేసింది.
అదే సమయంలో అభ్యర్థుల ఆలోచనలను, మాటలను అమెరికా ప్రజలు కూడా వినాలని సూచించింది. ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవాలని పేర్కొంది.
2021లో క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి ఘటనతో ఆయన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను మెటా నిలిపివేయడం తెలిసిందే. ఇదే రీతిలో ఎక్స్ (ట్విట్టర్) కూడా గతంలో ట్రంప్ ఖాతాపై నిషేధం విధించి, ఆ తర్వాత ఎత్తివేసింది. అయినప్పటికీ ట్రంప్ తన ఎక్స్ ఖాతాను ఉపయోగించడంలేదు.