Thalliki Vandanam: ఇంట్లో ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి ఇస్తామని నాడు జగన్ చెప్పలేదా? ఆ ముక్క పట్టుకుని నేను రాష్ట్రమంతా తిరగలేదా?: షర్మిల
- మూడు పార్టీల మధ్య మాటల దాడికి కారణమవుతున్న తల్లికి వందనం
- కుటుంబ సభ్యులపై కోపంతో షర్మిల సీఎం చంద్రబాబుకు సపోర్ట్ చేస్తోందన్న అంబటి
- పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ షర్మిల ఫైర్
- చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరిన ఏపీ పీసీసీ చీఫ్
తల్లికి వందనం పథకం ఇప్పుడు మూడు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమవుతోంది. వదిన (భారతి)పై కోపమో, అన్న (జగన్)పై కోపమో... కుటుంబ కారణాల వల్లో షర్మిల ఇప్పుడు చంద్రబాబును సపోర్ట్ చేసే కార్యక్రమం షురూ చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే.
దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేం అడిగితే... బాబుకు కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని షర్మిల ధ్వజమెత్తారు.
"వైసీపీ నేతలకు కళ్లుండి, వినడానికి చెవులుండి, విజ్ఞత కలిగిన వాళ్లే అయితే... మేం చెప్పింది ఏమిటో ఒకటికి పది సార్లు వినాలి. తల్లికి వందనం జీవో.29లో క్లారిటీ లేదని, సాక్షి కథనంపై వివరణ ఇవ్వాలని మేం చంద్రబాబును కోరాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపజేయాలని మేం డిమాండ్ చేశాం.
మరి, ఇది కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసినట్టు ఎలా అవుతుంది? మేం నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే... 24 గంటలు గడవకముందే ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోని తల్లుల పక్షాన మేం నిలబడితే కాంగ్రెస్ చంద్రబాబుకు తోకపార్టీ ఎలా అవుతుంది?
వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకుని నేను రాష్ట్రమంతా ప్రచారం చేయలేదా? ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? లేక, నిలువునా మోసం చేశారా అంటే... అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెబుతోంది.
ఆ రోజు నాతో ఊరూరా, ప్రతిచోట ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో, అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ.15 వేలు చొప్పున ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం.
మరి ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే నాతో ఎందుకలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు ప్రచారం చేశారు? సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని, జలయజ్ఞం పూర్తిచేస్తామని, ప్రత్యేకహోదా సాధిస్తాం అని ఎందుకు ప్రచారం చేయించారు? మీరు కూడా అదే విధంగా ఎందుకు ప్రచారం చేశారు? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?" అంటూ షర్మిల వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు.