Nitin Gadkari: అలా చేస్తే మనం అధికారంలోకి వచ్చి ప్రయోజనంలేదు: నితిన్ గడ్కరీ
- బీజేపీ భిన్నమైన పార్టీ అని అద్వానీ చెప్పేవారన్న గడ్కరీ
- ఇతర పార్టీల కంటే ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలని సూచన
- సామాజిక, ఆర్థిక సంస్కరణలకు రాజకీయాలు ఒక సాధనమని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను మనం పునరావృతం చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సొంత పార్టీ బీజేపీని హెచ్చరించారు. బీజేపీ భిన్నమైన పార్టీ అని, అందుకే మరోసారి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్నదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా మెజార్టీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ చేసే పనినే మనం కొనసాగిస్తే, వారు అధికారం నుంచి నిష్క్రమించినా... మనం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారన్నారు. పనాజీ సమీపంలో జరిగిన గోవా బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ అంటే భిన్నమైన పార్టీ అని అద్వానీ చెప్పేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల బీజేపీని ప్రజలు ఎన్నుకున్నారని గుర్తించాలన్నారు. అదే తప్పులను మన పార్టీ చేయకూడదని హెచ్చరించారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకు రావడానికి రాజకీయాలు ఒక సాధనమని కార్యకర్తలు గుర్తించాలన్నారు.