Kapil Dev: అతని వైద్యం కోసం నా పెన్షన్ ఇచ్చేస్తా: కపిల్ దేవ్

In Pain Kapil Dev Writes To BCCI Ready To Donate Pension For Ailing Anshuman Gaekwad
  • మాజీ ఆటగాడు అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ బారినపడటంపై విచారం
  • అతన్ని బీసీసీఐకి ఆదుకోవాలని విజ్ఞప్తి
  • వైద్య ఖర్చులకు నిధుల కోసం మాజీలంతా శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడి
భారత్ కు 1983లో తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ ను అందించిన టీమిండియా మాజీ దిగ్గజం, నాటి టీమిండియా సారథి కపిల్ దేవ్ బీసీసీఐకి బాధాతప్త హృదయంతో ఒక విజ్ఞప్తి చేశాడు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న నాటి వరల్డ్ కప్ జట్టులోని తన మాజీ సహచరుడు, 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ ను ఆదుకోవాలని కోరాడు. ఏడాది కాలంగా గైక్వాడ్ లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం నిధులు సేకరించేందుకు అప్పటి జట్టు సభ్యులైన మోహిందర్ అమర్ నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, మదన్ లాల్, రవి శాస్త్రి, కీర్తి ఆజాద్ శాయశక్తులా కృషి చేస్తున్నారని కపిల్ వెల్లడించాడు.

‘ఇది ఎంతో విచారకరం, కుంగుబాటుకు గురిచేసే విషయం. నేను ఎంతో బాధలో ఉన్నా. ఎందుకంటే.. అతనితో కలిసి నేను క్రికెట్ ఆడా. అతన్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నా. ఎవరూ అలా బాధపడకూడదు. బోర్డు అతన్ని సంరక్షించిందని తెలుసు. మేం ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. అన్షుకు అందే ఏ సాయం అయినా మీ మనస్ఫూర్తిగా రావాలి. ఆ కాలంలో అరవీర భయంకరులైన బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో అతను ముఖం, ఛాతీపై ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతని కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చింది. మన క్రికెట్ అభిమానులు అతన్ని ఓడించరని కచ్చితంగా నమ్ముతున్నా. అతను కోలుకొనేందుకు వారంతా దేవుడిని ప్రార్థించాలి’ అని కపిల్ దేవ్ స్పోర్ట్ స్టార్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ చెప్పాడు.

అయితే అన్షుమన్ లాంటి మాజీ ఆటగాళ్లను ఆదుకొనేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేకపోవడంపై కపిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఒకవేళ పరిస్థితి మెరుగుపడకపోతే తన పెన్షన్ ను వదులుకొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.

‘దురదృష్టవశాత్తూ మనకు ఒక వ్యవస్థ లేదు. కానీ ఈ తరం ఆటగాళ్లు బాగా డబ్బు ఆర్జిస్తుండటం మంచి విషయం. సహాయ సిబ్బందికి కూడా బాగానే డబ్బు చెల్లిస్తున్నారు. కానీ మా కాలంలో బోర్డు వద్ద అంత డబ్బు లేదు. ఇప్పుడు బోర్డు గత ఆటగాళ్లను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కానీ ఆటగాళ్లు వారి చందాలను ఎక్కడికి పంపించాలి? ఒకవేళ ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తే అందులోకి డబ్బు పంపించొచ్చు. దీన్ని బీసీసీఐ ఏర్పాటు చేస్తుందనుకుంటున్నా. వాళ్ల కుటుంబం అంగీకరిస్తే మా పెన్షన్ సొమ్మును కూడా విరాళం కింద అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కపిల్ దేవ్ చెప్పాడు.

అన్షుమన్ గైక్వాడ్ 1975 నుంచి 1987 వరకు సాగిన తన కెరీర్ లో 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అలాగే భారత జట్టు హెడ్ కోచ్ గా రెండుసార్లు వ్యవహరించాడు.
Kapil Dev
BCCI
Anshuman Gaeikwad
Blood Cancer
Treatment
London
Donate
Pension

More Telugu News