Adu jeevitham: ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. వచ్చే శుక్రవారం నుంచే ప్రసారం.. ఎందులోనంటే?

Adu Jeevitham Movie OTT Releasing Date Announced by NetFlix

  • మార్చిలో థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా
  • నాలుగు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
  • సౌదీ వలస కార్మికుడిగా సుకుమారన్ నటనకు విమర్శకుల ప్రశంసలు

సౌదీలో ఓ వలస కార్మికుడు ఎదుర్కొన్న దారుణ అనుభవాలను తెరకెక్కించిన సినిమా ‘ఆడు జీవితం’.. నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో వలస కార్మికుడిగా సుకుమారన్ నటనకు విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. బ్లెస్సీ దర్శకత్వంలో రూ.82 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సినీ వర్గాల అంచనా. మార్చి నెలాఖరున ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా బాగుందనే టాక్ నేపథ్యంలో మూవీ లవర్స్ ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

దాదాపు నాలుగు నెలలు గడిచిన తర్వాత తాజాగా ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ పై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఆడు జీవితం సినిమా ఈ నెల 19 (వచ్చే శుక్రవారం) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని నిర్దారిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది.

రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించిన బ్లెస్సీ..
న‌జీబ్ మహ్మ‌ద్ అనే మలయాళీ యువకుడి జీవితంలో వాస్తవంగా జరిగిన సంఘటనలను బెన్యామిన్ అనే రచయిత ‘గోట్ డేస్’ పేరుతో ఓ నవల రాశారు. 2008లో మలయాళంలో అత్యధికంగా అమ్ముడుపోయిన నవలగా ఇది రికార్డులు సృష్టించింది. ఈ నవల హక్కులు కొనుగోలు చేసిన డైరెక్టర్ బ్లెస్సీ.. దాదాపు పదేళ్లకు పైగా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆపై పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కించారు.

కథేంటి..
న‌జీబ్ మహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) ఉపాధి కోసమ‌ని త‌న స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోకుల్‌)తో క‌లిసి సౌదీకి వెళతాడు. అయితే, ఏజెంట్ మోసం చేయడంతో సౌదీలో బలవంతంగా గొర్రెల కాపరిగా పనిచేయాల్సి వస్తుంది. ఎడారిలో గొర్రెల కాపరిగా నజీబ్ ఎదుర్కొన్న కష్టాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. యజమాని వేధింపుల నుంచి నజీబ్ మహ్మద్ ఎలా తప్పించుకున్నాడనేది ఈ ఆడు జీవితం సినిమా.

  • Loading...

More Telugu News