Puri Ratna Bhandar: పూరీ ఆలయంలో రత్న భాండాగారం తెరిచాక అస్వస్థతకు గురైన ఎస్పీ
- 46 ఏళ్ల తర్వాత పూరీ ఆలయంలో రహస్య గదిని తెరిచిన వైనం
- గది లోపల శుభ్రం చేసిన సిబ్బంది
- అస్వస్థతకు గురైన ఎస్పీకి చికిత్స అందించిన వైద్యులు
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలంతా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
కాగా, రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిని ప్రత్యేక వాహనంలో పూరీ ఆలయం వద్దకు చేర్చారు. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, భలభద్రలకు చెందిన విలువైన ఆభరణాలను భద్రపరిచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు 'ఆజ్ఞ'ను నిర్వహించారు.
కాగా, ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు. నాలుగున్నర దశాబ్దాలుగా గదిని మూసి ఉంచడంతో, లోపల విషసర్పాలు ఉంటాయన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు.