Revanth Reddy: ఏముంది నా దగ్గర ఇవ్వడానికి?: కాంగ్రెస్ లో చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
- కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు
- తాము చేస్తున్న మంచి పనులకు అండగా నిలిచేందుకు వస్తున్నారన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడెక్కడా కనిపించడంలేదని ఎద్దేవా
తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీలోకి విపక్షాల నుంచి భారీగా వలసలు వస్తుండడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారని, ఇప్పుడు వాళ్లే కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా... వాళ్ల పార్టీలో ఎవరున్నారో, ఎవరు లేరో లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారు అని దెప్పిపొడిచారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన వద్ద నేతలకు ఇవ్వడానికేమీ లేదని, అయినా గానీ తాము చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచేందుకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని వివరించారు.
"మా ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదన్నారు. ఓడిన వాళ్లను, ఇంట్లో పడుకున్న వాళ్లను, ఫాంహౌస్ లో ఉంటున్న వాళ్లను అడుగుతున్నా... ఈ అవుటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చాడా? ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మీ ముత్తాత కట్టాడా?
ఇవాళ హైదరాబాదులో ఉన్న ఐటీ పరిశ్రమలను, ఫార్మా పరిశ్రమలను మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అవి తెచ్చినందువల్లే హైదరాబాద్ ఇవాళ మహానగరంగా మారింది. హైదరాబాద్ నగరానికి మీరేం తెచ్చారని ఇప్పుడు అడుగుతున్నా. మీరేం తెచ్చారంటే... గంజాయి తెచ్చి ఉంటారు, డ్రగ్స్ తెచ్చి ఉంటారు.
ఇవాళ హైదరాబాద్ ను ఇంకా అభివృద్ధి చేసి విశ్వనగరంగా మార్చేందుకు మేం ప్రణాళికలు రూపొందిస్తుంటే... పొద్దున లేస్తే కాళ్లలో కట్టెలు పెట్టే మాటలే. అయిపోయింది అయిపోయింది... కూలిపోయింది కూలిపోయింది అన్నారు. ఆ మాటలు అన్నవాళ్లు ఇప్పుడెక్కడున్నారు?
మేం చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఎగ్గె మల్లేశం వంటి వాళ్లు రిజర్వ్ బ్యాంక్ కే పైసలు ఇవ్వగలవాళ్లు. వాళ్లకు ఇవ్వడానికి నా వద్ద ఏముంది... నా అంగీ అమ్మినా, లాగు అమ్మినా ఏం రాదు... నేను ఏమిస్తాను వాళ్లకు? మా ఆలోచన విధానం నచ్చి వాళ్లు పార్టీలోకి వస్తున్నారు.
అచ్చోసిన ఆంబోతుల్లా, ఊళ్లలో మైసమ్మకు విడిచిపెట్టిన పోతుల్లా తిరుగుతూ... ప్రభుత్వాన్ని పడగొడతాం, పడగొడతాం అంటున్నారు. మీరు పడగొడతాం అంటే... మేం నిలబెడతాం అంటూ ఆ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు" అంటూ రేవంత్ రెడ్డి వివరించారు.