Nandamuri Balkrishna: హిందూపురంలో అభివృద్ధి పనులకు బాలకృష్ణ శంకుస్థాపన.. గత పాలకులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
- అనుభవం లేని పాలకుల వల్ల ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న బాలకృష్ణ
- అభివృద్ధిని అటకెక్కించి దందాలకు పాల్పడ్డారని విమర్శలు
- టిడ్కో ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేస్తామని హామీ
అనుభవం లేని పాలకుల వల్ల ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం రూరల్ మండలం కొటిపి వద్ద అసంపూర్తిగా నిలిచిన టిడ్కో ఇళ్లను ఎంపీ బీకే పార్థసారథి, అధికారులతో కలిసి బాలకృష్ణ నిన్న పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు అభివృద్ధిని అటకెక్కించి నకిలీ మద్యం, ఇసుక దందా, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 1200 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తిచేశామని, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అవి ఇప్పటి వరకు అలాగే అసంపూర్తిగా ఉండిపోయాయని మండిపడ్డారు. హడ్కో నిధులతో వాటిని పూర్తిచేసి పేదలకు అప్పగిస్తామని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించామని చెప్పారు. హిందూపురంలో యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు తీసుకొస్తామని, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాలకృష్ణ శంకుస్థాపనలు చేశారు.