IGI Airport: ఢిల్లీ విమానాశ్రయంలో దేశీ ప్రయాణికుల కోసం 24x7 లిక్కర్ స్టోర్!
- టర్మినల్ 3లో మద్యం దుకాణం ఏర్పాటుకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అనుమతి
- 750 చదరపు అడుగుల వైశాల్యంలో షాపు ఏర్పాటు
- షాపులో పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం అమ్మకం
ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికులకు త్వరలో మద్యం దుకాణం అందుబాటులోకి రానుంది. టర్మినల్ 3లో ఈ స్టోర్‌ను ప్రారంభించేందుకు ఢిల్లీ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్‌కు ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. ఐజీఐ ఎయిర్‌పోర్టులో తొలి ఎల్ - 10 స్టోర్ ఇదేనని అధికారులు తెలిపారు.
ఈ లిక్కర్ స్టోర్‌లో సెల్ఫ్ సర్వీస్ విధానం అమల్లో ఉంటుందని, 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. రాత్రి పగలూ, సెలవులు అనే తేడా లేకుండా నిత్యం అందుబాటులో ఉండే షాపులో కస్టమర్లకు ఎక్సై్జ్ శాఖ అనుమతి పొందిన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో అరైవల్, డిపార్చర్ ప్రదేశాల్లో డ్యూ ఫ్రీ లిక్కర్ షాపులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ షాపుల్లోకి కేవలం విదేశీ ప్రయాణికులనే అనుమతిస్తారు. అయితే, విమానాశ్రయ సిబ్బందికి, దేశీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి లిక్కర్ స్టోర్లు లేవు. త్వరలో ప్రారంభం కానున్న స్టోర్‌లో దేశవ్యాప్తంగా మద్యం ధరలను చూపించే డిస్ప్లే స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు. వ్యూహాత్మక ప్రాంతంలో ఈ లిక్కర్ స్టోర్‌ను ఏర్పాటు చేయనందున ఇది హర్యానాతో పాటు ఢిల్లీ సరిహద్దులోని వారికి ఉపయోగకరంగా ఉంటుందని, స్మగ్లింగ్ కు అడ్డుకట్ట పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.