Telangana: పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం... వీరికి వర్తించదు!

TG government released loan waiver guidelines

  • ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడి
  • 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీ
  • రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడించింది.

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడవచ్చు... లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి.

అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

రుణమాఫీ నిబంధనలు

- భూమి క‌లిగి ఉన్న ప్ర‌తి రైతు కుటుంబానికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ.
- ఈ ప‌థ‌కం స్వ‌ల్ప‌కాలిక పంట రుణాల‌కు వ‌ర్తిస్తుంది.
- రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్‌ల నుంచి తీసుకున్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
- 12.12.2018 తేదీన లేదా ఆ త‌ర్వాత మంజూరైన లేక రెన్యువ‌ల్ అయిన రుణాల‌కు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వర్తింపు.
- ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి రైతు కుటుంబం రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు పంట రుణ‌మాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బ‌కాయి ఉన్న అస‌లు, వ‌ర్తింప‌య్యే వడ్డీ మొత్తం ప‌థ‌కానికి అర్హ‌త క‌లిగి ఉంటుంది.
- రైతు కుటుంబం నిర్ణ‌యించ‌డానికి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ వారు నిర్వ‌హించే ఆహార భ‌ద్ర‌త కార్డు లేదా రేష‌న్ కార్డు డేటా బేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ కుటుంబంలో ఇంటి య‌జ‌మాని జీవిత భాగ‌స్వామి పిల్ల‌లు ఉంటారు.
- అర్హ‌త గ‌ల రుణ‌మాఫీ మొత్తాన్ని డీబీటీ ప‌ద్ధ‌తిలో నేరుగా ల‌బ్దిదారుల రుణ‌ ఖాతాల్లో జమ చేస్తారు. పీఏసీఎస్ విష‌యంలో రుణ‌మాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుద‌ల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణ‌మాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జ‌మ చేస్తారు.
- ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహ‌ణ క్ర‌మంలో రుణ‌మాఫీ మొత్తాన్ని జ‌మ చేయాలి.
- ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి క‌లిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఏది త‌క్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హ‌త ఉంటుంది.
- ఏ కుటుంబానికి అయితే రూ.2 ల‌క్ష‌ల‌కు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి ఉన్న రుణాన్ని మొద‌ట బ్యాంకుల‌కు చెల్లించాలి. ఆ త‌ర్వాత అర్హ‌త గ‌ల రూ.2 ల‌క్ష‌ల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాల‌కు బ‌దిలీ చేస్తారు.
- రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం ఉన్న ప‌రిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మ‌హిళ‌ల రుణాన్ని మొద‌ట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా ప‌ద్ధ‌తిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయాలి. 

  • Loading...

More Telugu News