Chandrababu: ఏమైనా చేయడానికి మనం ఏమైనా రాజులమా?: సీఎం చంద్రబాబు
- సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భూములు, ఖనిజ సంపద, అడవులపై శ్వేతపత్రం
- గత ఐదేళ్లలో ఇష్టానుసారం భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు
సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ ఆమోదించరని, మనం ఏమైనా రాజులమా అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సహజ వనరుల దోపిడీపై ఆయన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక ట్రస్టీపై రాష్ట్రాన్ని పరిపాలించమని ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని... ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండమని అధికారం ఇచ్చారే తప్ప... పెత్తందారీతనంలో ఇష్టారాజ్యం దోచుకోమని చెప్పలేదని దుయ్యబట్టారు.
సహజ వనరుల దోపిడీ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్టు అని, సహజ వనరుల దోపిడీ ఎలా సాగిందో ఇవాళ వివరిస్తానని చంద్రబాబు తెలిపారు. పంచభూతాలను మింగేసే పరిస్థితికి వచ్చారని విమర్శించారు.
"అభివృద్ధి చెందే క్రమంలో ఎక్కడైనా సరే భూములకు విలువ పెరుగుతుంది. అలాంటి భూములపై వివాదాలు సృష్టించి ఆ భూములను కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఖనిజ సంపదను కూడా దోచేశారు. అడవుల కోసం మనం ఒక శాఖనే ఏర్పాటు చేసుకున్నాం. ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కూడా ఉంది. పర్యావరణానికి తోడ్పడే అడవులను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడింది. రికార్డుల్లో అన్నీ ఉండవు. కొంతవరకే సమాచారం ఉంది. వాస్తవానికి వీరు దోచుకున్నది ఇంతకంటే ఎన్ని రెట్లు ఎక్కువో కూడా చెప్పలేను.
భూముల విషయానికొస్తే... విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరులో భూములు కబ్జా చేశారు. ఇళ్ల పట్టాలు, వైసీపీ కార్యాలయాల కోసం భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. అనర్హుల చేతికి అసైన్ మెంట్ భూములు వెళ్లాయి. ఏకంగా భూముల సరిహద్దులే మార్చేశారు.
వీళ్ల అక్రమాలకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పరాకాష్ఠగా చెప్పాలి. ఇంకెవరికీ భూమిపై హక్కులు లేకుండా, భూములన్నీ దోచుకోవడానికి ఈ యాక్ట్ తో ఒక రాచబాట వేసుకోవాలనుకున్నారు. రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను అక్రమంగా నివాస స్థలాలకు కేటాయించి అందులో వాటా కొట్టేశారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం హయగ్రీవ సంస్థకు ఇచ్చిన 12.51 ఎకరాల భూమిని అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కింద మార్చి అందులో వాటా కొట్టేసే ప్రయత్నం చేశారు.
కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను కేవలం లక్ష రూపాయల చొప్పున శారదాపీఠానికి కట్టబెట్టారు. సాహి హియరింగ్ కేర్ సంస్థకు ఎకరా భూమిని ఉచితంగా ఇచ్చేశారు.... అదేదో వీళ్ల సొంత సొమ్ము అయినట్టు.
ఒంగోలులోనూ రూ.101 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయి. కుటుంబ వివాదాలు ఉన్న భూములు, యాజమాన్య హక్కులు లేని ప్రైవేటు భూములు, బీడు భూములు, ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు గుర్తించి వాటిని చేజిక్కించుకునేలా అక్రమాలకు పాల్పడ్డారు. అందుకోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేవారు. ఒంగోలులో భూ అక్రమాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం.
ఇక, తిరుపతి నగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడన్నీ సెటిల్ మెంట్ భూములే. మఠం భూములు కూడా ఉన్నాయి. 22-ఏ ఉపయోగించి ఈ భూములను కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి, రేణిగుంట... పరిసర ప్రాంతాల్లో ఈ తరహా భూ దోపిడీ సాగించారు. కాలువ పోరంబోకు భూములు, చెరువు భూములు... వేటినీ వదల్లేదు. చిత్తూరులో రూ.99 కోట్ల విలువైన భూ అక్రమాలకు తెరలేపారు.
ఉమ్మడి ఏపీ హయాంలో నేను రెవెన్యూ మంత్రిగా పనిచేశాను. అప్పట్లో సెటిల్మెంట్ ల్యాండ్స్ కు సంబంధించి నెల్లూరులో ఓ కార్యాలయం ఉండేది. అడిగిన వాళ్లకు సెటిల్మెంట్ భూములు రాసిచ్చేయడం అక్కడ ఉండే అధికారి పని. ఇది చాలా ఫేమస్ కూడా. ఈ కాలంలో కూడా ఇంకా ఇలా భూములు రాసిచ్చేయడం ఏంటని నేను ఆ శాఖనే రద్దు చేశాను. ఇలాంటి భూములు ప్రభుత్వానికి చెందాలి.
కానీ, గత ఐదేళ్లలో చిత్తూరులో 982 ఎకరాలు రాచమార్గంలో ఇచ్చేశారు. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఒక పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి.
ఇళ్ల పట్టాల విషయంలో రూ.3 వేల కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు చెందిన 10 వేల ఎకరాల భూములను బలవంతంగా లాగేసుకున్నారు. కానీ, లబ్ధిదారులకు మాత్రం ఊరికి దూరంగా ఉండే భూములు, శ్మశాన భూములు, పొలాలకు పోయే భూములు ఇచ్చారు. ఆవ భూముల విషయంలోనూ ఇంతే. ఆవ భూముల్లో ఎవరూ ఇళ్లు కట్టలేరు. వర్షం పడితే కాళ్లు దిగబడే చెరువులు, గుంట్లో ఇళ్లు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ భూముల్లో ఆర్నెల్లు నీళ్లే ఉంటాయి. ఇళ్ల నిర్మాణం కోసమని అలాంటి భూములు 361 ఎకరాలు ఇచ్చారు.
వైసీపీ కార్యాలయాల కోసం భారీ ఎత్తున అక్రమాలకు తెరదీశారు. 23 జిల్లాల్లో జీవో నెం.340 ఉపయోగించుకుని, రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. అనుమతులు లేకుండా భవనాలు కట్టడమే కాకుండా, ఇది తప్పు అంటూ రౌడీయిజం చేసే పరిస్థితికి వచ్చారు. తాడేపల్లిలో కూడా నీటిపారుదల శాఖ అభ్యంతరాలు చెప్పినా పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయించారు.
అంతేకాదు, 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను వైసీపీ నేతలు చేజిక్కించుకున్నారు. జీపీఏ ద్వారా అత్యంత చవకగా దక్కించుకుని, ఆ తర్వాత ఆ భూముల స్టేటస్ ను ఫ్రీహోల్డ్ కిందకు మార్చాలని అధికారులపై బెదిరింపులకు పాల్పడేవారు" అని చంద్రబాబు వివరించారు.
గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చిందని, ప్రజలు ఓసారి తమ భూములు చెక్ చేసుకోవాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు సూచించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని అన్నారు. గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడ కూడా తెస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.