Singireddy Niranjan Reddy: అప్పుడే రేవంత్ రెడ్డి నాలుక మడతేశాడు: రుణమాఫీ మార్గదర్శకాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం
- ఇవి మార్గదర్శకాలు కాదు... మభ్యపెట్టే ప్రయత్నాలని విమర్శ
- రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న మాజీ మంత్రి
- పీఎం కిసాన్ డేటాను అనుసరించడమంటే లక్ష్యానికి గండి కొట్టడమేనని వ్యాఖ్య
తెలంగాణలో పంటల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసింది మార్గదర్శకాలు కాదని... మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని విమర్శించారు. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని విమర్శించారు.
రైతులకు సాయం అందించేందుకు కేసీఆర్ రైతుబంధును తీసుకువచ్చారన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయనట్లుగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలలవుతున్నా దానిని అమలు చేయలేదన్నారు.
ఈరోజు కొంతమందికే పరిమితమయ్యేలా మార్గదర్శకాలు తీసుకువచ్చారని విమర్శించారు. ఈరోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, రూ.30 వేల వేతనం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారన్నారు. రేషన్ కార్డు, పీఎం డేటా వంటి తోకా తొండాలు పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమితం చేశారన్నారు. రుణమాఫీ చేశామన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు బాగుండాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
అసలు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదన్నారు. అసలు దానికి సంబంధించిన షరతులే లోపభూయిష్టమన్నారు. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడమంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం... రైతాంగాన్ని వంచించడమే అన్నారు. హామీలు అమలు చేయడానికి ఈ ఆంక్షలు ఏమిటన్నారు.
నాడు పరుగెత్తి రుణాలు తీసుకోండని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వెంటనే రుణమాఫీ చేయలేదని... పైగా ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పిందని విమర్శించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవలే ప్రకటించాడని... సరిగ్గా నాలుగు రోజులు తిరగకముందే నాలుక మడతేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.