cave on moon: చంద్రుడిపై భారీ గుహను గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు!

Scientists confirm cave on moon could potentially shelter future astronauts
  • నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి 400 కి.మీ. దూరంలో గుహ    
  • భవిష్యత్తులో వ్యోమగాములకు ఆవాసం కానుందని వివరణ
  • అలాంటివే మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా
చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందని చెప్పారు. సోలార్ రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు ఇవి రక్షణ కల్పిస్తాయని వివరించారు.

అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 55 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే. ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం సోమవారం నిర్ధారించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా రికన్నైసెన్స్ ఆర్బిటర్ పంపిన రాడార్ మెజర్ మెంట్స్ ఆధారంగా ఈ బిలాన్ని కనుగొన్నామని చెప్పింది. అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.

భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా భారీ గుహలు ఉండొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదని, దీంతో ఈ గుహల విషయం మిస్టరీగా మారిందని సైంటిస్టులు చెప్పారు. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగిన ఈ మిస్టరీని తమ బృందం ఛేదించిందని ఇటలీ పరిశోధకులు వివరించారు. ప్రస్తుతానికి ఒక గుహను మాత్రమే కనుగొన్నప్పటికీ చంద్రుడిపై పదులు, వందల సంఖ్యలో గుహలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల చంద్రయాన్ 3 ల్యాండైన దక్షిణ ధృవంపై పెద్ద సంఖ్యలో గుహలు ఉంటాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఈ గుహలు తాత్కాలిక ఆవాసాలుగా మారతాయని, రేడియేషన్ తో పాటు చిన్న చిన్న ఉల్కాపాతాల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పారు.
cave on moon
astronauts
Italy Scientists
NASA
Chandrayaan-3

More Telugu News