Hyderabad: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు
- అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా వివిధ విభాగాల అధికారులకు సూచన
- విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు
- పాత భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని సూచన
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో ఇవాళ (మంగళవారం) సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర విభాగాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశ ఉందని, జనాలు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుందని, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించాలని మంత్రి ఆదేశించారు. నీళ్లు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ప్రాణ నష్టం జరగకుండా అన్ని అప్రమత్త చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత వహించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాలతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత భవనాల వద్ద ఉన్నవారిని ఖాళీ చేయించాలని, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు.