Apple Watch: సముద్రంలో పడిపోయిన ఏడాది తర్వాత దొరికిన యాపిల్ వాచ్.. ఇప్పటికీ పనిచేస్తున్న వైనం
యాపిల్ కంపెనీ వాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉంది. కేవలం టైమ్ చూసుకునేందుకే కాదు.. చాలా మంది వినియోగదారులు తమ ఫిట్‌నెస్ డేటాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు ఈ వాచ్‌లను వాడుతుంటారు. ముఖ్యంగా రన్నింగ్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, జిమ్‌లో వర్కౌట్స్‌తో పాటు పలు హెల్త్ అలర్ట్స్ కోసం వినియోగిస్తుంటారు. అయితే ఈ వాచ్‌లను సురక్షితమైన ప్రదేశాలలో వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ లోతైన నీటి ప్రదేశాలలో వాడడం ఏమంత మంచిది కాదు. ఎందుకంటే వాచ్ నీటి లోతుల్లో పడిపోతే మళ్లీ దొరకడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి యాపిల్ వాచ్ సముద్రంలో పడిపోయిన ఏడాది తర్వాత దొరికింది. అంతేకాదు ఆశ్చర్యం కలిగించేలా ఆ వాచ్ ఇంకా కచ్చితంగా పనిచేస్తోంది.
అమెరికాకు చెందిన జారెడ్ బ్రిక్ అనే వ్యక్తి తన అనుభవాన్ని వీడియో రూపంలో వెల్లడించాడు. ‘‘కరీబియన్స్ దీవుల సముద్రంలో స్కూబా డైవింగ్ చేసినప్పుడు నా యాపిల్ వాచ్ పోయింది. డైవింగ్ చేసే ప్రతిసారీ నేను యాపిల్ వాచ్ వాడుతాను. ఒక సంవత్సరం క్రితం కరీబియన్స్‌లో డైవ్ చేసినప్పుడు (జూన్ 2022) కూడా వాచ్ ధరించాను. డైవింగ్ అయిపోయాక పైకి వచ్చి చూస్తే వాచ్ లేదు. సముద్ర అందాలను చూస్తూ వాచ్ జారిపోయిన విషయాన్ని గుర్తించలేకపోయాను’’ అని జారెడ్ బ్రిక్ వెల్లడించారు.
దోహదపడ్డ ‘ఫైండ్ మై ఫీచర్’
యాపిల్ ఉత్పత్తుల్లో ఫైండ్ మై నెట్‌వర్క్ అద్భుతంగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. జారెడ్ బ్రిక్ విషయంలో కూడా ఈ ఫీచర్ పనిచేసింది. వాచ్ ఉన్న లోకేషన్ గుర్తించడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషించింది. వాచ్ సముద్రంలో పోయినప్పటికీ ఏదో చిన్న ఆశతో ‘ఫైండ్ మై నెట్‌వర్క్’లో వాచ్ పోయినట్టుగా మార్క్ చేశాడు. అయితే అతడు ఆశించినట్టుగానే ఆశ్చర్యపరిచే అద్భతం జరిగింది.
వాచ్ పోయిన ప్రాంతానికి సమీపంలోనే నివసించే వ్యక్తి నుంచి ఒక రోజు వాయిస్ మెయిల్ వచ్చిందని, వాచ్ దొరికినట్టు చెప్పారని జారెడ్ బ్రిక్ పేర్కొన్నాడు. అయితే వాచ్ దొరకడమే కాకుండా అది ఇంకా పనిచేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఫైండ్ మై నెట్‌వర్క్’ ఫీచర్‌పై బ్రిక్ సెట్ చేసిన మెసేజ్ వాచ్‌పై డిస్‌ప్లే అయింది. దీంతో అతడిని చేరింది. ఫైండ్ మై డివైజ్ ఎంతలా ఉపయోగపడుతుందో ఈ ఘటన మరోసారి తెలియజేసింది. కాబట్టి ఆండ్రాయిడ్ లేదా ఇతర పరికరాల్లో అందుబాటులో ఉన్న ‘ఫైండ్ మై డివైజ్’ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.