Jagga Reddy: ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదు: ప్రతిపక్షాలపై జగ్గారెడ్డి
- సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని వెల్లడి
- కార్యక్రమానికి వెళ్లకుండానే ఈటల బురదజల్లుతున్నారని విమర్శ
- ప్రోటోకాల్ లేకుండా కొందరు బతకలేకపోతున్నారని మండిపాటు
ప్రోటోకాల్ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు. సబితకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని, ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగవచ్చునన్నారు. ఇక, ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరిలో కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారన్నారు.
ప్రోటోకాల్ లేకుండా కొందరు బతకలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టెన్షన్ లేకుండా పని చేస్తున్నామని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారన్నారు. పదేళ్లలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాకే రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు.
ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం సహజమే అన్నారు. ఇది సీరియస్ మ్యాటర్ ఏమీ కాదన్నారు. రాజకీయాల్లో... పార్టీలు అత్తగారిల్లు, తల్లిగారిల్లు లాగా అయిపోయాయన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ మార్పులపై మాట్లాడటం అనవసరమన్నారు. కాంగ్రెస్ చరిత్రతో పోలిస్తే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వయస్సు, అనుభవం చాలా చిన్నవన్నారు.
ప్రతిపక్షాలను గౌరవించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. హరీశ్ రావు, కేటీఆర్‌లకు మతిమరుపు వచ్చినట్లుగా ఉందని, వారు ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? రేవంత్ విషయంలో ప్రోటోకాల్ పాటించని బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు. కోమటిరెడ్డి, సంపత్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కుట్ర చేసి అసెంబ్లీకి రానివ్వకుండా చేసినప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.