Siddaramaiah: ఆ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు... అంటూ పోస్ట్ పెట్టి.. ఆ వెంటనే తొలగించిన కర్ణాటక సీఎం
- కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న సీఎం పోస్ట్
- బిల్లుపై సర్వత్రా విమర్శలు
- పోస్టును తొలగించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
- ఇలాంటి నిర్ణయాలతో పెట్టుబడులు వెళ్లిపోతాయని ఆందోళన
కర్ణాటకలో ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టులలో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పారిశ్రామికవర్గాల నుంచి ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో బిల్లుకు సంబంధించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దానిని తొలగించారు.
ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపాక సిద్ధరామయ్య... కేబినెట్ ఆమోదం లభించిందంటూ పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రైవేటు పరిశ్రమల్లో సీ, డీ గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100 శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేసే బిల్లు కోసం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అందులో పేర్కొన్నారు. ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. తమది కన్నడిగుల ప్రభుత్వమని, వారి సంక్షేమమే ధ్యేయమని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఈ పోస్టును ఆయన తొలగించారు.
మరోవైపు, కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పష్టతను ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు పేర్కొంది. బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశముందని, భయపడాల్సిన అవసరం లేదని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.
కేబినెట్ నిర్ణయంపై పారిశ్రామికవర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ విమర్శించారు. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాంగ్రెస్ ఇలాంటి బిల్లును తీసుకువస్తుందంటే నమ్మలేకపోతున్నామన్నారు.