MPDO: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేఖ రాసిన నరసాపురం ఎంపీడీవో
- అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో
- పోలీసుల గాలింపు
- ఫెర్రీ లీజుదారు బకాయిలు చెల్లించనందునే అదృశ్యమైనట్టు వార్తలు!
- రూ.55 లక్షల ఫెర్రీ బకాయిల అంశంతోనే పవన్ కు లేఖ రాసిన ఎంపీడీవో
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన ఏలూరు కాలువలో దూకి ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జులై 10 నుంచి సెలవులో ఉన్న వెంకటరమణారావు మచిలీపట్నం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరారు.
ఈ నెల 16న ఆయన పుట్టినరోజు కాగా... పుట్టినరోజే తన చివరి రోజు అంటూ ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాధవాయిపాలెం ఫెర్రీ పాటదారు లక్షల్లో బకాయి ఉన్నందునే, ఒత్తిడి భరించలేక వెంకటరమణారావు అదృశ్యమైనట్టు తెలుస్తోంది.
కాగా, ఎంపీడీవో వెంకటరమణారావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. కొందరు వ్యక్తులు రూ.55 లక్షల మేర ఫెర్రీ లీజు బకాయి పడ్డారని వెంకటరమణారావు ఆ లేఖలో పేర్కొన్నారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండతో వారు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. గత మూడున్నర నెలలుగా వారు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చేయని తప్పుకు మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బకాయిలు రికవరీ చేయనందున ప్రభుత్వం తనను బాధ్యుడ్ని చేసే అవకాశం ఉందంటూ వాపోయారు. ఎంపీడీవో ఉద్యోగమే తనకు జీవనాధారం అని, సదరు వ్యక్తులు బకాయిలు చెల్లించేలా చేసి తనకు న్యాయం చేయాలని వెంకటరమణారావు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.