Usha Chilukuri: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉష చిలుకూరి వంశ వృక్షం ఇదీ!
- ఉష పూర్వీకుల మూలం ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం
- దశాబ్దాల క్రితమే కృష్ణా జిల్లా వీడిన ఉష పూర్వీకులు
- చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డ ఉష తల్లిదండ్రులు
అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సెనెటర్ జేడీ వాన్స్ ఎంపికైన నాటి నుంచి ఆయన భార్య ఉష చిలుకూరి పేరు అమెరికాలోనే కాకుండా భారత్‌లో కూడా మారుమోగిపోతోంది. ఏపీ మూలాలున్న ఉష గురించి మరింత తెలుసుకునేందుకు భారతీయులు, తెలుగు ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. అయితే, ఉషకు విశాఖపట్నంలో ఇప్పటికీ బంధువులు ఉన్నారు. తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరసు అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా పని చేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ శాస్త్రి సంతానమే ఉష.
ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో తమకు ఆమెతో పరిచయం తక్కువేనని శాంతమ్మ తెలిపారు. వాన్స్ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్‌లో అభినందఅలు తెలిపారన్నారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. తాము వాన్స్- ఉషల వివాహానికి హాజరైనట్టు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’’ అని శాంతమ్మ అన్నారు. ఎన్నికల తరువాత వాన్స్ దంపతులను విశాఖకు ఆహ్వానిస్తామన్నారు. 98 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ గతేడాదివరకూ విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బోధించడానికి వెళ్లేవారు. ప్రస్తుతం పరిశోధన విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు.
ఉష వంశ వృక్షం ఇదీ..
ఉష చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచు. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటోంది. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా మారి ఉష వరకూ విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లు, ఆయనకు రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మూర్తి అని ఐదుగురు సంతానం, అందరూ ఉన్నత విద్యావంతులే.
వీరిలో రామశాస్త్రి ఎప్పుడో మద్రాసు వెళ్లిపోయారు. ఐఐటీ మద్రాసులో ఆయన ప్రొఫెసర్. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి. వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ.. ముగ్గురు కుమారులు. శారద కుమార్తె. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా.. శారద చెన్నైలో ఉంటున్నారు.
రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చేశారు. శాన్‌డియేగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉష.
సాయిపురానికి చెందిన రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఉష తాత రామశాస్త్రి చిన్న సోదరుడు గోపాలకృష్ణ శాస్త్రి, తాను తోడళ్లుళ్లం అవుతామని, ఒక ఇంటి ఆడపడుచులనే వివాహాలు చేసుకున్నామని వివరించారు. ఇటీవలే తమ వంశవృక్షం రూపొందించినట్టు తెలిపారు.