Hyderabad-Raigir: ఘట్‌కేసర్-యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్.. పనుల్లో కీలక ముందడుగు
- 2016-17లో రూ. 330 కోట్లతో ప్రతిపాదనలు
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయం
- ఆ తర్వాత మూలన పడిన ప్రాజెక్టులో మళ్లీ కదలిక
- రూ. 412 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు ఇది శుభవార్తే. ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్-యాదరిగుట్ట (రాయగిరి) స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలుమార్గం పనుల్లో కీలక ముందడుగు పడింది. 33 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గం కోసం 60 ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్న రైల్వే శాఖ త్వరలోనే భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ రైల్వే లైనును నిర్మించేందుకు 2016-17లో రూ. 330 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. అయితే, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఈ రైల్వేలైను విషయాన్ని పట్టించుకోకపోవడంతో రైల్వేశాఖ కూడా ఈ ప్రాజెక్టును పక్కనపెట్టింది.
తాజాగా, ఈ రైల్వే లైను విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా పూర్తిగా కేంద్రం నిధులతో రైల్వేలైను వేసేందుకు అంగీకరించింది. రైల్ వికాస్ నిగమ్ (ఆర్‌బీఎన్ఎల్) ద్వారా పనులు చేపట్టనున్నారు. కాగా, అప్పట్లో రూ. 330 కోట్లు అవుతుందనుకున్న ఖర్చు ప్రస్తుతం రూ. 412 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు.