NEET-UG Results: జులై 20 మధ్యాహ్నం 12 గంటల్లోపు నీట్ ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

NTA asked to publish NEETUG results city wise and centre wise
  • ఫలితాలను అధికారిక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశం
  • అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా చూసుకోవాలని సూచన
  • ఫలితాలు ప్రకటించాలంటూ ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ నిర్ణయం
ఎల్లుండి (శనివారం) మధ్యాహ్నం 12 గంటల్లో నీట్-యూజీ ఫలితాలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్ గురువారం ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) ఆదేశాలు జారీ చేసింది. నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని, అయితే అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని నీట్ కమిటీకి స్పష్టం చేసింది. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా విద్యార్థుల అందరి ఫలితాలను విడుదల చేయాలంటూ ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా వాదనలు వినిపించారు. ఫలితాలను ప్రకటించాలని కోరారు. అయితే ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్‌ స్పందిస్తూ.. పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్‌ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ నీట్-యూజీ 2024లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రకటించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. పాట్నా, హజారీబాగ్‌లలో లీకేజీ జరిగినట్టు ఒప్పుకున్నారని, అయితే ఈ లీకేజీ ఆ కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇంకా వ్యాపించిందా? అనే నిర్ధారణ కావాల్సి ఉందని డీవై చంద్రచూడ్ అన్నారు. ఫలితాలు ప్రకటించకపోవడంతో విద్యార్థులు నిశ్చేష్టులు అయ్యారని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రాల వారీగా మార్కులు గమనిద్దామని చంద్రచూడ్ అన్నారు. కాగా నీట్ అవకతవకలపై దాఖలైన తదుపరి పిటిషన్లపై సోమవారం విచారణను కొనసాగించనుంది.
NEET-UG Results
NEET-UG Paper Leak Row
Supreme Court
NEET

More Telugu News