Stock Market: లాభాల పరంపర.. జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిసిన దేశీయ మార్కెట్లు

Sensex 81000 mark for the first time and Nifty scaling the record 24800 level on Thursday
  • చరిత్రలో తొలిసారి 81,000 మార్కును అధిగమించిన సెన్సెక్స్
  • 24,800 రికార్డు స్థాయి మార్క్‌ స్థాయికి నిఫ్టీ
  • ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్ల పరుగులతో మార్కెట్లలో జోష్ 
దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగవ రోజైన గురువారం కూడా లాభాలను నమోదు చేశాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లు లాభాల్లో పయనించడంతో ఇరు సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సెన్సెక్స్ 626.91 పాయింట్లు అంటే 0.78 శాతం వృద్ధి చెంది 81,343.46 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీ 81 వేల మైలురాయిని తాకడం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ రికార్డ్ స్థాయిలో ముగిసింది. గురువారం 187.85 పాయింట్లు అంటే 0.76 శాతం లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 24,800.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే గరిష్ఠంగా 224.75 పాయింట్లు లాభపడి గరిష్ఠంగా 24,837.75ను తాకింది.

ఐటీ రంగ షేర్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా గణనీయమైన లాభాల్లో ముగిశాయి. ఇక సూచీలో బడా కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లలో కొనుగోళ్ల జోరు కూడా మార్కెట్ లాభాలకు దోహదపడింది.

జూన్ త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చనే అంచనాలు, రూపాయి బలహీనపడటంతో ఈ రంగ షేర్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. సెప్టెంబరు నాటికి అమెరికా ఫెడ్ రేటు తగ్గించవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూఎస్ బాండ్ ఈల్డ్‌లకు బదులు భారతీయ ఈక్విటీలలోకి పెట్టుబడులకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మొగ్గుచూపాయని చెప్పారు. కాగా మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ  ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ వంటి ప్రధాన షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Stock Market
Sensex
Nifty
IT Stocks

More Telugu News