Barack Obama: బైడెన్ తప్పుకుంటేనే మేలు.. ఒబామా కూడా అదే మాట!
- డెమోక్రాట్ల అభ్యర్థి మార్పు తప్పేలా లేదంటున్న విశ్లేషకులు
- బైడెన్ పోటీపై పార్టీ సీనియర్లలో చాలామంది విముఖత
- పునరాలోచించుకోవాలన్న మాజీ ప్రెసిడెంట్ ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి మార్పు తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకూ ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న జో బైడెన్ పై వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు బైడెన్ పోటీపై విముఖత ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బైడెన్ కు సన్నిహితుడిగా పేరొందిన మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా చేరారు. అధ్యక్ష అభ్యర్థిత్వంపై, ఎన్నికల్లో పోటీ చేయడంపై బైడెన్ మరోసారి ఆలోచించుకుంటే మేలని ఒబామా తాజాగా వ్యాఖ్యానించినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ గురువారం ఓ కథనం ప్రచురించింది. దీంతో బైడెన్ విమర్శకులకు మరింత పట్టు చేకూరినట్టయింది.
వృద్ధాప్యం కారణంగా ప్రెసిడెంట్ జో బైడెన్ మతిమరుపు, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చాలారోజులగా విమర్శలు వినిపిస్తున్నాయి. పలు వేదికలపై బైడెన్ ప్రవర్తన, ప్రసంగాలలో తడబాటు పడడం వంటి ఘటనలు సాధారణంగా మారాయి. ఒకరికి బదులుగా మరొకరిని సంబోధిస్తూ బైడెన్ నవ్వులపాలవుతున్నారని డెమోక్రాట్లు చెబుతున్నారు. బైడెన్ మానసిక ఆరోగ్యంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ను బరిలోకి దించితే డొనాల్డ్ ట్రంప్ పై గెలవడం సాధ్యంకాదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బైడెన్ తనకు తానుగా పోటీ నుంచి తప్పుకుంటే మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, బైడెన్ మాత్రం ఈ విమర్శలను, సూచనలను తోసిపుచ్చారు. ట్రంప్ పై పోటీ చేసి గెలిచే సత్తా తనకు మాత్రమే ఉందని అంటున్నారు. శారీరకంగా, మానసికంగా తాను ఫిట్ గా ఉన్నానని, మరో నాలుగేళ్ల పాటు అమెరికా ప్రెసిడెంట్ గా ప్రజలకు సేవ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు.