Jagan: జగన్ కాన్వాయ్ ని మధ్యలోనే ఆపేసిన పోలీసులు..!
- వినుకొండకు బయలుదేరిన జగన్ ను మధ్యలోనే ఆపేసిన వైనం
- రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం యత్నం
- 144 సెక్షన్ కారణంగా ర్యాలీలకు అనుమతి లేదని వివరణ
- చివరకు ఒంటరిగా మరో కారులో వినుకొండ చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి భారీ వాహనశ్రేణితో వినుకొండ వెళుతున్న జగన్ ను మధ్యలోనే ఆపేశారు. వినుకొండలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోందని, ర్యాలీలు ప్రదర్శనలకు అనుమతి లేదని వివరించారు. దీంతో జగన్ తన కాన్వాయ్ ని వదిలి మరో కారులో వినుకొండ వెళ్లారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు.
రషీద్ కుటుంబానికి పరామర్శ
బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్ తో బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో జగన్ ఒక్కరే పోలీస్ సెక్యూరిటీ నడుమ వినుకొండ చేరుకున్నారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ వచ్చి పరామర్శించవచ్చనీ, కానీ జనసమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని పేర్కొన్నారు.