Harish Rao: హరీశ్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తారు?: షబ్బీర్ అలీ ప్రశ్న
- రుణమాఫీ ఇష్టం లేని బీఆర్ఎస్ అవాకులు, చెవాకులు పేలుతోందని విమర్శ
- బీఆర్ఎస్ త్వరలో జీరో కాబోతుందన్న షబ్బీర్ అలీ
- ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్ కు మతిభ్రమించిందని వ్యాఖ్య
ఇచ్చిన హామీ మేరకు తాము రుణమాఫీ చేశామని, ఇక హరీశ్ రావు తన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. రుణమాఫీ సంబరాల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీ చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే అవాకులు, చెవాకులు పేలుతోందన్నారు.
బీఆర్ఎస్ త్వరలో జీరో కాబోతుందని వ్యాఖ్యానించారు. గైడ్ లైన్స్ తెలియకుండానే గతంలో బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. ఇంటికి ఒక్క రుణమాఫీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దన్నారు. పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ చేయదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని, కానీ ఏకకాలంలో చేయడంతో వారికి మతిభ్రమించిందన్నారు.
వరంగల్‌లో రాహుల్ గాంధీని రప్పించి కృతజ్ఞత సభ నిర్వహిస్తామన్నారు. రుణమాఫీ అసాధ్యమని విపక్షాలు ఎన్నిసార్లు విమర్శించినా రేవంత్ రెడ్డి ఆ హామీని నిలబెట్టుకున్నారన్నారు. ఎనిమిది నెలల్లోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కితాబునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.