Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy launches RajeevGandhi civils abhayahastham
  • 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించిన సీఎం
  • సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ఆర్థిక సాయం కోసం పథకం
  • సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.

అంతకుముందు, సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలు ముగియగానే గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహిస్తే తమకు ప్రిపేర్ కావడానికి సమయం లేకుండా ఉంటుందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని, దీంతో డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్లు చెప్పారు. తెలంగాణ యువత ఆశలను నెరవేర్చుతున్నామని చెప్పడానికే తాను, తన మంత్రులు.. కలిసి మీతో సమావేశమయ్యామన్నారు. 

సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. 

నిరుద్యోగుల బాధలు తమకు తెలుసునని... ఏళ్ల తరబడి వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. టీజీపీఎస్‌ను పునర్వ్యవస్థీకరించినట్లు చెప్పారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా వేయడం సరికాదన్నారు.
Revanth Reddy
Congress
Telangana
Incentives For Civil Services Examinations

More Telugu News