Gottipati Ravi Kumar: ఏపీలో భారీ వర్షాలు... అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- బంగాళాఖాతంలో వాయుగుండం
- గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు
- అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి గొట్టిపాటి
- ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని స్పష్టీకరణ
- విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిన చోట సహాయ చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు
ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన వెలువడడం, ఇప్పటికే చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీఈపీడీసీఎల్ అధికారులతో నేడు అమరావతి నుంచి వర్చువల్ గా సమీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడిన మంత్రి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, ఇతర సమస్యల పరిష్కారానికి సమాయత్తం కావాలని స్పష్టం చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగిన చోట సహాయ చర్యలు ప్రారంభించాలని నిర్దేశించారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.