Puri Ratna Bhandar: పూరీ భాండాగారంలో ఆయుధాలు!
- భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వెల్లడి
- సంపద వివరాలు బహిర్గతం చేయరాదని నిర్ణయం
- రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని వెల్లడి
- సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతేనని స్పష్టీకరణ
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని , ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజానాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతో పాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజానాలో ఉంచి సీల్ చేశామని, అంతా వీడియో కూడా తీయించామని అన్నారు.
పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్యగదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతేనని జస్టిస్ రథ్ స్పష్టం చేశారు.