Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు! నిరసనకారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు జారీ!
- యుద్ధ వీరుల కుటుంబాలకు రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టు తీర్పు
- ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు జారీ
- యుద్ధ వీరులను సమున్నతంగా గౌరవించుకోవడం పౌరుల బాధ్యత అంటున్న ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధ వీరుల కుటుంబాలకు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా మొదలైన యూనివర్సిటీ విద్యార్థుల నిరసనలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు, రిజర్వేషన్లపై నేడు అక్కడి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిని కాల్చి చంపేయాలంటూ షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు కూడా జారీ చేసింది.
1971 యుద్ధ వీరుల కుటుంబాలతో సహా వివిధ వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి పైగా ఉన్న నేపథ్యంలో యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. యుద్ధ వీరుల కుటుంబాల రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తూ హైకోర్టు గత నెల తీర్పు ఇచ్చిన తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిరసనలు దేశవ్యాప్తంగా చెలరేగాయి. పోలీసులు, యువతకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 133 మంది కన్నుమూశారు. ఘర్షణల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను నిరవధికంగా మూసేసింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ సుమారు వెయ్యి మంది భారత విద్యార్థులు స్వదేశానికి తరలివచ్చారు.
ఇక నిరసనకారులను 71 నాటి యుద్ధంలో పాకిస్థాన్‌కు సహకరించిన వారితో పోల్చడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ కోటాకు పూర్తిగా మద్దతు తెలిపింది. దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని రాజకీయాలకు అతీతంగా సమున్నతంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొంది.