NEET ReTest: నీట్ రీటెస్ట్ లో మాజీ టాపర్లకు వచ్చిన మార్కులు ఎన్నంటే..?
- నీట్ 2024లో హర్యానాలోని ఒకే సెంటర్ లో ఆరుగురికి 720/720
- తిరిగి పరీక్ష రాసిన 494 మందిలో ఒక్కరికి 682 మార్కులు
- 600 పైగా మార్కులు తెచ్చుకున్న మరో 13 మంది స్టూడెంట్లు
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా సంస్థల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2024 లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. హర్యానా బహదూర్ గఢ్ లోని ఓ స్కూలులో నీట్ రాసిన విద్యార్థుల్లో ఆరుగురికి 720/720 మార్కులు రావడం ఈ అనుమానాలకు తావిచ్చింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో సదరు పరీక్షా కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఆలస్యంగా ఇవ్వడం, ప్రశ్నాపత్రంలో, సిలబస్ లో తప్పుల కారణంగా విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో గ్రేస్ మార్కులు కలిపామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వివరణ ఇచ్చింది. ఈ గ్రేస్ మార్కులతో ఆరుగురికి ఫుల్ మార్కులు వచ్చినట్లు పేర్కొంది.
నీట్ రాసిన విద్యార్థులు, పేరెంట్స్ కోర్టుకు వెళ్లడంతో బహదూర్ గఢ్ సెంటర్ లో పరీక్ష రాసిన విద్యార్థులకు ఎన్టీఏ రీటెస్ట్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించగా.. అందులో 800 మంది మాత్రమే పరీక్ష రాశారు. బహదూర్ గఢ్ సెంటర్ లో 494 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటిసారి ఫుల్ మార్కులు తెచ్చుకున్న ఆరుగురు విద్యార్థులకు తాజాగా వెలువరించిన రీటెస్ట్ ఫలితాల్లో 7 వందల లోపే మార్కులు వచ్చాయి. మొత్తం విద్యార్థుల్లో ఒక్కరికే 682 మార్కులు రాగా, మరో పదమూడు మందికి 600 పైగా మార్కులు వచ్చాయి.