Baba Ramdev: రాందేవ్ కు లేని అభ్యంతరం రహ్మాన్ కు ఎందుకు?.. యూపీ సర్కారు ఆదేశాలపై యోగా గురు ప్రశ్న
- హోటల్ యజమానులు తమ పేర్లు వెల్లడించడానికి అభ్యంతరం దేనికని నిలదీసిన రాందేవ్ బాబా
- చేసే పనిలో స్వచ్ఛత, నిజాయితీ ఉంటే ఏ మతమైనా ఒకటేనని వివరణ
- కన్వర్ యాత్ర మార్గాల్లో హోటల్స్ పై నేమ్ ప్లేట్ తప్పనిసరి చేసిన యూపీ సర్కారు
కన్వర్ యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, ఇతర తినుబండారాల యజమానులు తమ పేర్లను హోటల్ బోర్డుపై ప్రదర్శించడం తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ సర్కారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 న కన్వర్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆదేశాల అమలుపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన హోటళ్లు, తినుబండారాల దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించింది.
అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ప్రజల్లో మతపరమైన విభేదాలు సృష్టించేందుకు యోగి సర్కారు ఈ ఆదేశాలు జారీ చేసిందని, ఓ వర్గం వారిని టార్గెట్ చేసిందని పలువురు విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కారు ఆదేశాలను సమర్థిస్తూ ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఆదేశాలపై రాందేవ్ బాబాకు లేని అభ్యంతరం రహ్మాన్ కు మాత్రం ఎందుకని నిలదీశారు. మనం చేసే పనిలో స్వచ్ఛత, నిజాయితీ ఉన్నంత కాలం మన మతమేదైనా పెద్దగా పట్టింపులోకి రాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత గుర్తింపునిచ్చే పేరును వెల్లడించడంలో సమస్య ఏముందని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ తమ పేరు పట్ల గర్వంగా ఫీలవ్వాలని చెబుతూ పేరును దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు. చేసే పనిలో స్వచ్ఛత ఎంతనేదే చూస్తారు తప్ప ఆ పని చేసే వ్యక్తి హిందువా, ముస్లిమా లేక క్రిస్టియనా లేక మరొకటా అనేది ఎవరూ చూడరని రాందేవ్ బాబా గుర్తు చేశారు.