AP Minister Aintha: మాజీ సీఎం జగన్ కు మంత్రి అనిత సూటి ప్రశ్న
- 36 హత్యలు ఎక్కడ జరిగాయో వివరాలు చెప్పాలని డిమాండ్
- నాలుగు హత్యలు జరిగితే 36 హత్యలని ప్రచారం చేస్తున్నారని ఫైర్
- ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవన్న హోంమంత్రి
తెలుగుదేశంలో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. అబద్ధపు ప్రచారాలకు తెరలేపినందుకు మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదోనంటూ జగన్ ను మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈమేరకు మంగళగిరిలో హోంమంత్రి అనిత ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై అనిత మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని వివరించారు.
చనిపోయిన వారిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు, నాయకులేనని గుర్తుచేశారు. జరిగిన విషయం ఇది.. కానీ జగన్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ఆ 36 హత్యల వివరాలు ఇస్తే పోలీసులతో సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. అలాకాకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. ఇంకా ప్రజలు తన మాటలు నమ్ముతారని జగన్ భావించడం హాస్యాస్పదమని హోంమంత్రి అనిత కొట్టిపారేశారు.