Corporators: విశాఖలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు
- ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన వలసలు
- విశాఖలో టీడీపీలో చేరిన ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికిన ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం వలసల పర్వం మొదలైంది! విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు 'సైకిల్' ఎక్కారు. కార్పొరేటర్లు గోవింద్, కంపా హనూక్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పలరత్నం, రాజారామారావు, వరలక్ష్మి టీడీపీలో చేరారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆ ఏడుగురు కార్పొరేటర్లకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... విశాఖ నగరాభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ద్వారానే విశాఖ అభివృద్ధి జరగాల్సి ఉందని, అందుకే వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకున్నామని వివరించారు.
కార్పొరేషన్ మేయర్ గడువుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.