Note for Vote: ఓటుకు నోటు కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. విచారణ వాయిదా

Supreme Court Posts Hearing On note For Vote Case Another Two Weeks
  • కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాలని కోరిన జగదీశ్ రెడ్డి
  • సుప్రీంకోర్టులో జగదీశ్ రెడ్డి పిటిషన్ పై విచారణ
  • ట్రయల్ ను మార్చాల్సిన అవసరమేంటని ప్రశ్నించిన సుప్రీం బెంచ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ట్రయల్ ను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఓటుకు నోటు కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాల్సిన అవసరం ఏముందని జగదీశ్ రెడ్డి లాయర్లను బెంచ్ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం అయితే కోర్టులు ఎలా ప్రభావితం అవుతాయని అడిగింది. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైతే వాటిని పొరుగుదేశం పాకిస్థాన్ కు మార్చాలా? అంటూ సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి జగదీశ్ రెడ్డి లాయర్లు బదులిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల ప్రాసిక్యూట్ చేసే ఏజెన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. కేసులో కీలకమైన ఆధారాలను తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రిజాయిండర్ వేసేందుకు తమకు సమయం కావాలని జగదీశ్ రెడ్డి లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఓటుకు నోటు కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
Note for Vote
Revanth Reddy
BRS MLa
Jagadish Reddy

More Telugu News